చదివిస్తాం, పెళ్లిచేస్తామని..బాలికలను వ్యభిచార కూపంలోకి || PUBLICMEDIA

0
81

చదివిస్తాం, పెళ్లిచేస్తామని..

బాలికలను వ్యభిచార కూపంలోకి

101 మంది మైనర్లకు విముక్తి కల్పించిన రాచకొండ పోలీసులు

PUBLICMEDIA, హైదరాబాద్:

అభం శుభం తెలియని బాలికలనూ కేటుగాళ్లు వదలడం లేదు. పెంచుకుంటామంటూ.. చదివిస్తామంటూ.. పెళ్లి చేస్తామంటూ తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొస్తున్నారు. కాసుల కక్కుర్తితో వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నాలుగేళ్లలో 101 మంది మైనర్లను ఈ కూపం నుంచి రక్షించారు.

దళారుల సాయంతో వల.

2016 నుంచి ఇప్పటివరకు రాచకొండ పోలీసులు 144 వ్యభిచార గృహాలను మూసివేయించారు. అక్కడ మగ్గిపోతున్న 547 మంది బాధితురాళ్లకు విముక్తి కల్పించారు. వీరిలో సుమారు 20 శాతం మంది మైనర్లే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు విటుల ఆసక్తి దృష్ట్యా ఎంత డబ్బయినా ఇచ్చేందుకు వెనకడుగేయరని విచారణలో తేలడంతో పోలీసులే ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. దండిగా డబ్బులు వస్తుండటంతో వ్యభిచార గృహాల నిర్వాహకులు దళారుల సాయంతో బస్తీలు, గ్రామాల్లో ఎక్కువ మంది అమ్మాయిలున్న పేద కుటుంబాలపై వల విసురుతున్నారు. ఫలానా ఆశ్రమం నుంచి వచ్చామంటూ నమ్మించి ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి ఇక్కడికి తీసుకొస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇక్కడికొచ్చాకా నయానో.. భయానో బెదిరించి ఈ రొంపిలోకి దింపుతున్నారని, ఆ ప్రభావం వారి మానసిక ఆరోగ్యంపై పడుతుందని వివరిస్తున్నారు.

భర్త విదేశాల్లో ఉన్నాడంటూ..

పోలీసులకు అనుమానం రాకుండా నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారని, నేను, నా ఇద్దరు పిల్లలు ఇక్కడుంటామంటూ ఏకంగా అపార్ట్‌మెంట్లలోనే అద్దెకు దిగుతున్నారు. పురుషులు ఆ దరిదాపుల్లోకి కూడా రారు. అసలు నిర్వాహకులు తెరవెనుకే ఉంటారు. దందా అంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తోంది. డబ్బులు కూడా గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా మాత్రమే తీసుకుంటారు. విటులు కోరిన చోటుకే బాలికలను తీసుకెళ్తారు. కొంత కాలం తర్వాత ఆ ఇద్దరు బాలికలను వేరే ముఠాకు విక్రయించి.. కొత్తవారిని ఇంటికి తీసుకొస్తారు. నా పిల్లలను భర్త దగ్గరికి పంపించానని, వీరు మా బంధువులంటూ పరిచయం చేస్తారు. దీంతో పోలీసులు, స్థానికులకు ఎలాంటి అనుమానం తలెత్తడం లేదు. కొన్నాళ్లకు నేను కూడా నా భర్త దగ్గరికి వెళ్లిపోతున్నానంటూ అడ్డా మార్చేస్తున్నారు.

Contact DetailsMr.Showkath Ali Basha (Chairman)+91 82470 25470Mr.RaviTeja (Director)+91 63098 76494

Posted by PM News on Wednesday, August 5, 2020
Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here