కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మహమ్మారి సోకిన వారి ప్రాణాల్ని కాపాడటమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ప్లాస్మా సేకరణ కార్యక్రమాన్ని ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు అభినందించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కృషిని అభినందించారు.
తన పుట్టిన రోజున అభిమానుల ప్లాస్మాదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని. కరోనా జయించినవారు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
° ప్లాస్మా దానం చేయండి.. ప్రాణాలు నిలబెట్టండి
ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం అవసరం. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రాణాలను నిలబెట్టేందుకు ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగపడుతోంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్లాస్మా దానం ప్రాముఖ్యత తెలిపేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ అవగాహనతో ముందుకొచ్చి ప్లాస్మా దానం చేసిన వారందరికీ అభినందనలు. సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడేందుకు దోహదపడే ప్లాస్మాను దానం చేయాలని కోరుతున్నాను.

ముఖ్యంగా నా పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా డొనేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో చైతన్యం పెంచాలి.
అవకాశం ఉన్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అని పేర్కొన్నారు.
ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చాలా సమర్థంగా నిర్వహిస్తోంది. వారికి అభినందనలు.
అనుక్షణం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటునే ఈ ప్లాస్మా దానం గురించి ప్రజలకు చెబుతూ ఎంతోమంది ప్రాణాల్ని కాపాడుతున్న సీపీ సజ్జనార్ కృషికి ప్రత్యేక అభినందనలు.
కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం ద్వారా మరికొందరి ప్రాణాల్ని కాపాడినవాళ్లవుతారు.
ప్లాస్మా దానం చేయండి. ఇంకొకరి ప్రాణాలు నిలబెట్టండని మహేశ్ విజ్ఞప్తి చేశారు.